సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. 

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారికి రూ. 50వేలు చెల్లించనున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. 

సికింద్రాబాద్‌లో మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూంలో చెలరేగిన మంటల సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా అదే బిల్డింగ్‌ పై అంతస్థుల్లో ఉన్న రూబీ హోటల్‌‌కు వ్యాప్తించాయి. ఈ ప్రమాదంలో హోటల్‌లో బస చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రి, సమీపంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

Scroll to load tweet…


బాధితుల్లో ఎక్కువ మంది వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినట్టుగా సమాచారం. బాధితుల వివరాలు, చిరునామాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక, అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లాడ్జీ ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఇక, ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూంలోని బ్యాటరీలు పేలడంతో ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూబీ హోటల్ భవనాన్ని పోలీసులు సీజ్ చేశారు.