ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా పిలిచారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేయాలని ఏక్ భారత్ నినాదాన్ని భాగ్యనగర్‌లోనే ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో పేరు మార్పుపై చర్చ మరోసారి తీవ్రమైంది.

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు హైదరాబాద్‌ను భాగ్యనగర్ అని పలికారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ను భాగ్యనగర్ అని అన్నారు. ఈ భాగ్యనగర్‌లోనే సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఏక్ భారత్ అనే నినాదాన్ని ఇచ్చారని తెలిపారు. 

అనంతరం ఈ వ్యాఖ్యలను మరింత వివరిస్తూ బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ అందరికీ ఎంతో విలువైన భాగ్య నగర్ అని పేర్కొన్నట్టు తెలిపారు. సర్దార్ పటేల్ ఇక్కడే దేశాన్ని ఏకం చేయడానికి పునాదులు వేశారని వివరించారు. ఇప్పుడు ఆ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపై ఉన్నదని తెలిపారు.

బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌లు హైదరాబాద్‌ పేరు మార్చాలని పలుమార్లు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలని పేర్కొన్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హైదరాబాద్‌ను భాగ్యనగర్ అని పలకడంతో పేరు మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. ఇక్కడ పేరు మార్చే డిమాండ్‌ను బీజేపీ బలంగా ముందుకు తెస్తున్నదా? అనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి పియూష్ గోయల్‌ను ఈ విషయమై ప్రశ్నించగా.. ఆయన దాదాపు ఔను అన్నట్టుగానే సమాధానం ఇచ్చారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులతో కలిసి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని పియూష్ గోయల్ వివరించారు.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ వెలుపల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో అంటే 2017లో ఒడిశాలో, 2016లో కేరళలో, 2015లో బెంగళూరులో నిర్వహించింది.