గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్టుగా విజయా రెడ్డి వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్టుగా విజయా రెడ్డి వెల్లడించారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న విజయా రెడ్డి.. కాంగ్రెస్‌లో పార్టీ నాయకులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఈరోజు ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అంతేకాకుండా అగ్నిపథ్ అంశంలో రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా విజయారెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైనట్టే. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న విజయారెడ్డికి ఆ పార్టీ నాయకత్వంతో తన రాజకీయ భవిష్యతుకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్టుగా చెప్పారు.
అనంతరం విజయారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కోసం తన తండ్రి పీజేఆర్ ఎంతో పనిచేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నానని చెప్పారు. చాలా రోజుల నుంచి రేవంత్‌రెడ్డితో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్ రాజకీయం అవసరం అని అన్నారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్టుగా వెల్లడించారు.
ఇక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా విజయారెడ్డి విజయం సాధించారు. ఆమె మేయర్ పదవిని ఆశించారని.. అది దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఆ తర్వాత కూడా పార్టీ అధిష్టానం తీరుపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని విజయారెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
