తాజ్ మహల్ నిర్మించకుంటే పెట్రోల్ రేట్లు ఇప్పుడు లీటర్‌కు రూ. 40 ఉండేదని, తాజ్ మహల్, లాల్ ఖిల్లా నిర్మించి షాజహాన్ తప్పు చేశాడని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 

న్యూఢిల్లీ: ప్రసిద్ధ కట్టడం తాజ్‌ మహల్‌ను షాజహాన్ నిర్మించకుంటే ఈ రోజు లీటర్ పెట్రోల్ రూ. 40కే లభించేదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీని, ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్యలు అన్నింటికీ ముఘల్ పాలకులు, ముస్లింలేనని అధికార పార్టీ ఆరోపిస్తుంటుందని ఆయన ఓ మీటింగ్‌లో విమర్శలు సంధించారు.

మన దేశంలో యువకులు నిరుద్యోగులుగానే ఉన్నారని, ద్రవ్యోల్బణం చుక్కలను తాకుతున్నదని, డీజిల్‌ను లీటర్ రూ. 102 చొప్పున అమ్ముతున్నారని ఒవైసీ అన్నారు. అయితే, వీటన్నింటికీ ఔరంగజేబునే కారణం కానీ, ప్రధాని మోడీ కానే కాదు అని విమర్శించారు. ఉద్యోగులు లేకపోవడానికి కారణం అక్బర్ పాలకుడు కారణం అని, లీటర్ పెట్రోల్ ధర రూ. 104.. రూ. 115కు అమ్ముతున్నారంటే కూడా తాజ్ మహలే కారణం అని అన్నారు.

ఒక వేళ తాజ్ మహల్‌ను నిర్మించకుంటే ఈ రోజు లీటర్ పెట్రోల్ రూ. 40కే లభించేదని ఒవైసీ వ్యంగ్యంగా చెప్పారు. ప్రధాన మంత్రి గారూ.. తాజ్ మహల్, లాల్ ఖిల్లా నిర్మించి షాజహాన్ తప్పు చేశాడని వివరించారు. వాటిని నిర్మించే బదులు ఆ డబ్బును ఆదా చేసి 2014లో మోడీకి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ముస్లింలు బాధ్యులు.. ముఘల్స్ బాధ్యులు అని వ్యంగ్యం పలికారు. 

అసలు భారత్‌ను కేవలం ముఘల్స్ పాలకులే పాలించారా? అశోకుడు పాలించలేదా? చంద్రగుప్త మౌర్య పాలించలేదా? కానీ, బీజేపీకి ఎందుకు ముఘల్స్ మాత్రమే కనిపిస్తారు? వారు ఒక కంటిలో ముఘల్స్‌ను ఒక కంటిలో, మరో కంటిలో పాకిస్తాన్‌ను చూస్తుంటారని అన్నారు.

భారత ముస్లింలకు ముఘల్స్ పాలకులతో, పాకిస్తాన్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. మహమ్మద్ అలీ జిన్నా చేసిన ప్రతిపాదనను తాము ఎప్పుడో తిరస్కరించామని చెప్పారు. ఈ ఏడాది భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేడుక చేసుకుంటున్నామని వివరించారు. జిన్నా ప్రతిపాదనను తిరస్కరించి భారత్‌లోనే ఉండిపోయిన తరాల వారసులే ఇప్పటి ముస్లింలు అని చెప్పారు.

మేము ఇష్టపడే దేశం భారత్ అని, మేం భారత్‌ను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్లబోమని స్పష్టం చేశారు. ‘మీరు ఎన్ని నినాదాలు అయినా చేయండి.. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోండిన నెత్తినోరు కొట్టుకున్నా.. మేం ఇక్కడే జీవించి ఇక్కడే మరణిస్తాం’ అని ఒవైసీ అన్నారు.