కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ టీఆర్ఎస్ పార్టీ నిరసనలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేయాలని నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

వరి కొనుగోలుపై (paddy procurement) కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ మీదుగా వెళ్లే నాలుగు జాతీయ రహదారులపై టీఆర్ఎస్ (trs) రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే హైవేలపై రాస్తారోకోపై తెలంగాణ హైకోర్టులో (telangana high court) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. టీఆర్ఎస్ నిరసనల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది. 

కాగా.. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ తరహ పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ (kcr) ఇదివరకే ప్రకటించారు. ఈ నెల 11న ఢిల్లీలో ఆందోళన తర్వాత కూడా కేంద్రం నుండి స్పందన రాకపోతే ఏం చేయాలనే దానిపై కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒకే విధానం ఉండాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పంజాబ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేస్తున్నట్టుగానే తమ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కూడా టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.

ఈ విషయమై గతంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ (piyush goyal ) తో కూడా తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. అయితే కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ తీరును తప్పు బట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయత్నాలు చేస్తుందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ఎలా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామో తెలంగాణ నుండి కూడా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రంపై వరి ధాన్యం విషయమై టీఆర్ఎస్ ఎంపీలు ఏదో ఒక రూపంలో నిరసనకు దిగుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని కూడా టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 

మరోవైపు వరి ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీలు (bjp) రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ (congress) విమర్శలు చేస్తుంది. ఈ విషయమై ఈ రెండు పార్టీల తీరును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పు బడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలను మాని వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. ఈ నెల 4వ తేదీ నుండి కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఈ ఆందోళనలకు ముగింపుగా వరంగల్ లో ఈ నెల 28న సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ఎఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ (rahul gandhi) పాల్గొంటారు. వరంగల్ సభ తర్వాతి రోజున హైద్రాబాద్ లో పార్టీ నేతలతో రాహుల్ గాంధీ పాల్గొంటారు.