పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు సంబంధించిన గడువు ముగిసిపోతుందని భయపడుతున్నారా.. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో 15 రోజుల పాటు చలాన్లు చెల్లించేందుకు గడువు ఇస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు తెలంగాణ పోలీసులు వాహనదారులకు డిస్కౌంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం గడువు మార్చి 31తో ముగియనుంది. అయితే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం, క్లియర్ చేసుకోవాల్సిన చలాన్లు వుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్లు చెల్లించుకునేందుకు మరో 15 రోజులు గడువు ఇస్తున్నట్లు శుభవార్త చెప్పింది.
ఈ మేరకు తెలంగాణ హోం శాఖ మంత్రి (telangana home minister) మహమూద్ అలీ (mahmood ali) ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షల చలాన్లను చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ చలాన్లు చెల్లించలేక పోయినవాళ్లు రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చలాన్లు క్లియర్ చేసుకోవాల్సిందిగా సూచించారు.
కాగా.. తెలంగాణలో పెండింగ్ చలానాలపై (pending challan) రాయితీ ప్రకటిస్తూ ఇటీవల పోలీస్ శాఖ (telangana police) నుంచి సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. టూ, త్రీవీలర్స్, తోపుడు బండ్లకు 75 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సుఅలకు 70 శాతం రాయితీ ఇస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. కార్లు, హెవీ వెహికల్స్‌కు 50 శాతం డిస్కౌంట్‌తో పాటు మాస్కులు ధరించని వారి ఫైన్లకు కూడా భారీ రాయితీ ఇస్తున్నారు. చలాన్‌లో విధించిన వెయ్యికి రూ.100 చెల్లిస్తే క్లియర్ చేస్తున్నారు. మార్చి 1 నుంచి 31 వరకు ఈ చలాన్ల వెబ్‌సైట్‌లో పేమెంట్లు ఇస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది.
ఇకపోతే.. హైదరాబాద్ లో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్ లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒక స్కూటర్ యజమానికి అత్యధికంగా 178 ఈ-చలాన్లు పెండింగ్ లో ఉండగా, మరో బైకర్ గరిష్ట మొత్తం రూ.73,690లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. చలాన్ల చెల్లింపునకు ప్రత్యేక రాయితీ కల్పించిన తర్వాత కూడా ఇంకా పెండింగ్ లో ఉన్న వాహనదారులపై కొరడా ఝుళిపించాలని ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు.
178 పెండింగ్ ఈ-చలాన్‌లతో కూడిన స్కూటరిస్ట్ ప్రధానంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు బుక్ చేయబడింది. ఆగస్టు 2019 నుండి ఇప్పటివరకు మొత్తం 178 చలాన్లను ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించినందుకు విధించారు. పెండింగ్ లో ఉన్న చలాన్ల చెల్లింపునకు ప్రత్యేక రాయితీ ప్రకటించిన తర్వాత కూడా మార్చి 17న బోరబండ బస్టాప్‌లో హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు మరోసారి జరిమానా విధించారు. దీంతో పెండింగ్ చలాన్ల అసలు మొత్తం 48,595 అయితే, అతను కేవలం 12,490 చెల్లించడం ద్వారా అన్ని జరిమానాలను క్లియర్ చేయవచ్చునని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
