హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసిన కిలాడీ లేడీ పై రాచకొడం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెంది పొదల శివరంజని అలియాస్ స్వాతిరెడ్డి ఉపాధి కోసం హైద్రాబాద్ కు వచ్చింది.

కొంతకాలం పాటు రైల్వే శాఖలో పనిచేసింది. రైల్వే శాఖతో పాటు పోస్టల్ డిపార్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించింది.  నిరుద్యోగులు ఈ మాయలేడీ మాటలను నమ్మారు. ఒక్కో ఉద్యోగానికి ఒక్కొక్కరి నుండి రూ. 6.5 లక్షలను వసూలు చేసింది. 

నిరుద్యోగులకు అనుమానం రాకుండా ఉండేందుకు గాను రాధాకృష్ణ అలియాస్ కిష్టయ్య అనే వ్యక్తిని రైల్వే శాఖకు చెందిన ఉన్నతోద్యోగిగా ఆమె నిరుద్యోగులకు పరిచయం చేసింది. పలువురి నుండి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసింది. ఈ డబ్బులను వసూలు చేసిన తర్వాత నిరుద్యోగుల నుండి తప్పించుకొని తిరిగింది.

ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించారు. రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. ఎల్ బీ నగర్ ఎస్ వో టీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. పలువురిని మోసం చేసిన స్వాతిరెడ్డిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసినట్టుగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. బాధితుల నుండి సుమారు రూ. 50 లక్షల వరకు స్వాతిరెడ్డి వసూలు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.