Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీ పంచాయితీ : సోనియాతో కోమటిరెడ్డి భేటీ.. అదేబాటలో ఢిల్లీకి రేవంత్..

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో ఎటూ తేలేలా కనిపించడం లేదు. మాకంటే మాకంటూ రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇవ్వాళా, రేపు అని ఎదురు చూస్తున్నా ఇప్పట్లో అంతు కనిపించేలా లేదు. 

PCC Chief Race : MP Komatireddy Venkat Reddy meets Sonia Gandhi in Delhi,  Revanth Reddy Left For Delhi - bsb
Author
Hyderabad, First Published Dec 16, 2020, 3:48 PM IST

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో ఎటూ తేలేలా కనిపించడం లేదు. మాకంటే మాకంటూ రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇవ్వాళా, రేపు అని ఎదురు చూస్తున్నా ఇప్పట్లో అంతు కనిపించేలా లేదు. 

ఈ క్రమంలో బుధవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు 20 నిముషాలపాటు సమావేశమయ్యారు. తర్వాత ఆయన రాహుల్ గాంధీని కూడా కలవాలని అనుకుంటున్నారు. తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. 

ఇదిలా ఉంటే మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ డిఫెన్స్ కమిటీకి సంబంధించిన సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం రేవంత్ రాహుల్ గాంధీని కలవనున్నారు. 

కాక రేపుతున్న టీపీసీసీ.. రేవంత్ టార్గెట్ గా అధిష్టానానికి హెచ్చరిక లేఖ..

రెండు రోజుల్లో నిర్ణయమన్న టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారనేది అందరికీ అర్థమై.. అర్థం కాకుండా ఉంది. నేతలు మాత్రం ఎవరికివారు తమకు అవకాశం ఇస్తే అలా చేస్తాం.. ఇలా చేస్తామంటూ ప్రకటనలు చేశారు. 

ఆఖరుకి మా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయని ఓపెన్‌గా చెప్పుకునే వరకు పోయారు. అధిష్టానం అయితే ఓ నిర్ణయానికి వచ్చిందని, పేరు కూడా ఫైనల్ అయిందని, అయితే మిగిలినవారిని మానసికంగా సిద్ధం చేయడానికే సమయం తీసుకుంటుందనే వార్తలు వచ్చాయి.

ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు వినిపించాయి. మరోవైపు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిలు తిరుగుతున్నారు. అయితే చివరికి రేవంత్ రెడ్డి పేరే ఎక్కువగా వినపడుతోంది. ఆ పేరునే ఎక్కువమంది సూచించినట్లుగా సమాచారం. అయితే కీలకంగా ఉన్న సీనియర్ నేతలు రేవంత్‌ను అడ్డుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

రేవంత్‌కు ప్రత్యామ్నాయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వినపడుతోంది. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ పేరునే కాస్త సమయం తీసుకుని ప్రకటిస్తారని, ఈ లోపు మిగిలినవారిని మానసికంగా సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే  రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కొంతమంది కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి లేఖ రాశారు. రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇస్తే కొందరు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతారని హెచ్చరిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతల పేరుతో ఓ లేఖ సోనియా గాంధీకి రాశారు. 

అందులో ఎవరి పేరు కూడా పెట్టలేదు. రేవంత్ టార్గెట్‌గా ఈ లేఖ రాయబడింది. రేవంత్ ఆర్ఎస్ఎస్ వ్యక్తిని.. అలాంటి వారితో బీజేపీని ఎలా ఢీ కొడతామని ప్రశ్నించారు. బీజేపీ రేవంత్‌పై సీబీఐ కేసు పెట్టాలని చూస్తోందని ఆ లేఖలో రాశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios