హైదరాబాద్:ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈ నెల 19న జేఎసీ తలపెట్టిన బంద్‌కు తాము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను  అర్ధం చేసుకోవాలని  పవన్ కళ్యాణ్   కోరారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 వతేదీ నుండి  సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, హైద్రాబాద్ లో  కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

48 వేల మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని చెప్పడం ఉద్యోగవర్గాల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడ తీవ్ర ఆవేదనను  కల్గిస్తోందని ఆయన అన్నారు. ఇకపై బలిదానాలు జరగకూడదని  ఆయన కోరారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం తక్షణం  చర్చించాలని  ఆయన కోరారు. సమ్మె జఠిలం కాకుండా చూడాలని  ఆయన విన్నవించారు. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 19 వ తేదీ వరకు పలు కార్యక్రమాలను రూపొందించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ  కార్మికులను విధులను తొలగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 1200 ఉద్యోగులు మాత్రమే ఆర్టీసీలో ఉన్నారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన ఆర్టీసీ కార్మికులను ఆవేదనకు గురిచేసిందని జేఎసీ నేతలు చెబుతున్నారు. జేఎసీ సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. ఈ నెల 19వ తేదీన  తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఎసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.