తెలంగాణలో జనసేన పోటీ చేసే విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.
తెలంగాణలో జనసేన పోటీ చేసే విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన జనసేన పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో జనసేన పోటీ గురించి స్పందించారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయనున్నట్టుగా చెప్పిన పవన్ కల్యాణ్.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై నిర్ణయాన్ని మాత్రం తెలంగాణలోని పార్టీ నాయకులకు వదిలిపెట్టారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనా..? లేదా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలా..? నిర్ణయించాలని కోరారు. రెండు ఎంపీ స్థానాల్లోనా..? ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేద్దామా..? అని తెలంగాణలోని పార్టీ నాయకులను అడిగారు. కొండగట్టు నుంచి తెలంగాణలో జనసే రాజకీయం మొదలు పెడదామని అన్నారు.
ఇక, తెలంగాణ మహా చైతన్యం ఉన్న నేల అని అన్నారు.. 1947లో కర్నూలులో మనం జెండా ఎగరవేస్తే.. 1948లో తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. రజాకర్ల దాష్టీకంతో తెలంగాణ ప్రజలు నలిగిపోయారని గుర్తుచేశారు. శ్రీకాంతాచారితో సహా వెయ్యి మంది బలిదానంతో తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణలో కూడా కులాలు ఉన్నాయని.. అయితే అన్ని కులాల్లో తెలంగాణ అనే భావన ఉందన్నారు. కడుపు కాలితే చేసే పోరాటమే యుద్దం అని అన్నారు. తనకు తెలంగాణ నుంచే పోరాట పటిమ వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు.
