తెలంగాణ ఎన్నికలపై జనసేనాని సంచలన ప్రకటన.. ఒంటరిగా బరిలో దిగుతారా? పొత్తు పెట్టుకుంటారా?
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో జనసేనాని పవన్ కళ్యాణ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాగైనా సీఎం కేసీఆర్ ను గద్దెదించి అధికార పగ్గాలను చేపట్టాలని ప్రణాళికలను రూపొందిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా జోరు మీద ఉంది. అధికారపార్టీ నేతలను తన పార్టీలో చేరుకుంటూ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో జనసేన సంచలన ప్రకటన చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తెలంగాణ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో పోటీకి సంసిద్ధం కావాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పోటీ చేసే నియోజకవర్గాలను వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
ఈ తెలంగాణ జనసేన సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులుమహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు శ్రీరామ్ తాలూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధా రామ్ రాజలింగం పాల్గొన్నారు. మరికొద్ది నెలలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ పోటీ చేస్తామని పార్టీ నేతలకు చెప్పడంతో.. ఇక్కడ ఆయన సొంతంగా బరిలోకి దిగుతారా ? లేక బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీ ప్రతిపక్షానికి పెద్ద దిక్కు జనసేనాని
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన కీలకం కానున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడంతో ప్రతిపక్షానికి పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కుగా మారారు. ఇప్పటికే టీడీపీ అధినేతకు సపోర్టుగా ఉంటూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఈ తరుణంలో ప్రజల మధ్యకు వెళ్లేందుకు నాలుగో విడత ‘జనసేన వారాహి విజయ యాత్ర’ను అక్టోబర్ 1న ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 న కృష్ణాజిల్లాలోని అవనిగడ్డలో పార్టీ నాయకులతో సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ పేర్కొంది. నాలుగో విడత విజయ యాత్రకు సమన్వయకర్తల నియామకానికి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి జనసేన ఏపీ రాజకీయాల్లోనే చురుక పాల్గొంటారనే టాక్ నడుస్తోంది.