కెటిఆర్ పోరాడి గెలిచారు, నారా లోకేష్ ఏం చేశాడు: పవన్ కల్యాణ్

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 16, Aug 2018, 7:43 AM IST
Pawan Kalyan questions Nara Lokesh
Highlights

మంత్రి కెటీఆర్ కు పోరాటం చేసిన అనుభవం ఉందని, ఆయన ప్రజల్లో గెలిచారని పవన్ కల్యాణ్ అంటూ నారా లోకేష్ కు ముఖ్యమంత్రి అయ్యే అనుభవం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కెటి రామారావుకు పోరాటం చేసిన అనుభవం ఉందని, నారా లోకేష్ కు మంత్రి అయ్యే అనుభవం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల కష్టాలు తెలిసినవాళ్లు, ప్రజాక్షేత్రం నుంచి వచ్చినవాళ్లు రాజకీయాల్లోకి రావాలని ఆయన అన్నారు. 

మంత్రి కెటీఆర్ కు పోరాటం చేసిన అనుభవం ఉందని, ఆయన ప్రజల్లో గెలిచారని పవన్ కల్యాణ్ అంటూ నారా లోకేష్ కు ముఖ్యమంత్రి అయ్యే అనుభవం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ తాత 60 ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారని ఆయన ఎన్టీ రామారావును ఉద్దేశించి అన్ారు. 

 తాను ఆదిలాబాద్‌లో గిరిజన తండాలకు వెళ్లానని, అరకు గిరిజన గ్రామాలకు వెళ్లానని, అక్కడి వృద్ధులూ మహిళలతో మాట్లాడానని, వైఎస్‌ జగన్‌ మాదిరిగా వాళ్లు రూ.కోట్ల ఆస్తులు అడగటం లేదని, తాగేందుకు మంచి నీళ్లు కావాలంటున్నారని, ఈ పాలకులు అది కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. 
 
బుధవారం ప్రశాసన్‌నగర్‌, మాదాపూర్‌లోని జనసేన కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. అవినీతికీ చిన్నారులపై అకృత్యాలకు పాల్పడేవారిని, మహిళలకు రక్షణ ఇవ్వని వారిని తమ పార్టీ శత్రువులుగా భావిస్తుందని చెప్పారు. 

తనకు వేల కోట్లు సంపాదించాలని, వారసులను అధికారంలోకి తేవాలన్న ఆశలు లేవని అన్నారు. తన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌లో తెలంగాణ అంశాలను కూడా ప్రస్తావించి ఉంటే తాను పూర్తి సంతృప్తితో ఉండేవాడినని అన్నారు. పబ్‌లు, బైక్‌ రేసులు అంటూ తిరుగుతున్న యువకులు భగత్‌సింగ్‌ ప్రాణత్యాగం గురించి తెలుసుకోవాలని సూచించారు. 

గోవధ విషయంలో రాజకీయం చేయొద్దని, బీఫ్‌ తినడం కొందరి ఆహారపు అలవాటని, జోక్యం చేసుకోకపోవడమే మంచిదని అన్నారు. ముస్లింలను మైనారిటీలుగా పిలవడం తనకు నచ్చదని, వాళ్లూ భారతీయులే అని, వాళ్లకూ అందరితోపాటు సమాన హక్కులున్నాయని అన్నారు. 

తెలంగాణపై తనకు పిచ్చిప్రేమ అని, ఇక్కడ జనసేనను దశల వారీగా ముందుకు తీసుకెళ్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తెలంగాణలో పార్టీకి బలం ఉన్న చోట పోటీ చేస్తామని, మిగతా చోట్ల ప్రభావితం చేస్తామని అన్నారు. 

పవన్‌ ప్రసంగిస్తుండగా ఓ కార్యకర్త ఆయన వైపునకు దూసుకొచ్చాడు. వ్యక్తిగత సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా పవన్‌ వారించారు. దీంతో ఆ యువకుడు పవన్‌ను కౌగలించుకుని ఆయన కాళ్లకు దండం పెట్టి వెనుదిరిగాడు.

loader