గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్వహించబోయే పాత్రపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కక్షసాధింపు కోసమే వైసిపి అధినేత జగన్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు. 

ప్రతిపక్ష నేత జగన్‌ను తెలంగాణ గడ్డపై అడుగు పెట్టనీయబోమని అప్పట్లో తెరాస వాళ్లే అడ్డుకున్నారని పవన్ గుర్తుచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉండేవారని ఆయన అన్నారు. అలాంటిది ఇప్పుడు టీఆర్‌ఎస్‌తో జగన్ కలసి నడుస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో వీళ్లని చూస్తే అర్ధమవుతుందని ఆయన అన్నారు.

దోపిడీ వ్యవస్థపై పోరాడాలంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ యువత ఎలా రోడ్లపైకి వచ్చారో.. అలా రావాలన్నారు. నందివెలుగు అడ్డరోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, పెదరావూరు బహిరంగ సభలో ప్రసంగించారు. 

దోపిడీ వ్యవస్థపై పోరాటానికి జాగోరే జాగో కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రతి పనికీ నేతలపైనే ఆధారపడటం సరైంది కాదని, విదేశాల్లో ఇలాంటి వ్యవస్థ ఉండదని ఆయన అన్నారు. విదేశాలకు వెళ్లి ఉపాధి సృష్టిస్తున్న మనవాళ్లు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారని అడిగారు.