పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు కన్నుమూత.. కుటుంబంలో తీవ్ర విషాదం..
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్‌రెడ్డి(34) కన్నుమూశారు.

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్‌రెడ్డి(34) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. వివరాలు.. విష్ణవర్దన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి బీఆర్ఎస్‌లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్దన్ రెడ్డి జూలై 23న హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు జాన్‌డీస్‌తో బాధపడుతున్నట్టుగా తేల్చారు.
దీంతో గత మూడు రోజులుగా ఆస్పత్రిలో విష్ణువర్దన్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. గత అర్ధరాత్రి తరువాత నుంచి ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు మృతి చెందారు. దీంతో ఆయన కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విష్ణువర్ధన్ రెడ్డి మృతేదేహానికి మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తీవ్ర విషాదంలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇక, విష్ణువర్దన్ రెడ్డికి భార్య డాక్టర్ కిరణ్మయి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం సాయంత్రం పటాన్‌చెరు సమీపంలో విష్ణువర్దన్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.