భార్య, భర్తల మధ్య మనస్పర్థలు ఆ కుటుంబాన్ని నాశనం చేసేసింది. బిడ్డను చంపేసి ఆ దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మన్నెగూడెం గ్రామానికి చెందిన అక్కె రాంబాబు(27), కృష్ణవేణి(24)లకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

కాగా.. భార్య, బిడ్డను ఇంటికి తీసుకురావాలని రాంబాబు చిల్కోయిలపాడు వెళ్లాడు. తిరిగి వస్తూ తమ ద్విచక్రవాహనాన్ని పొలం వైపు తీసుకువెళ్లారు. అక్కడ తమ 9 నెలల చిన్నారి గొంతు నులిమి నీటిలో పడేశారు. అనంతరం దంపతులు అక్కడే ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి మందు.. తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని రాంబాబు తన మరదలికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

కాగా..వీరి మరణంతో దంపతుల మొదటి బిడ్డ అనాథగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.