హైదరాబాద్: సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడ తన జోరును కొనసాగించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితుడు  బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు.

ఉగాదిని పురస్కరించుకొని హైద్రాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం నాడు పంచాంగ శ్రవణం నిర్వహించారు.  ఈ ఏడాది రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సంతోష్ కుమార్ శాస్త్రి సూచించారు.

తెలంగాణ రాష్ట్రానికి ఆర్ధికంగా ఎలాంటి లోటుండదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రం ఎలాంటి ఇబ్బందుల్లో ఉండదన్నారు. ఈ ఏడాది ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కత్తిమీద సాము చేయాల్సి వస్తోందన్నారు. హరీష్ రావు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భవిష్యత్తు బాగుంటుందని ఆయన చెప్పారు. జులై నుంచి అక్టోబర్ వరకు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Also read:సెప్టెంబర్ తర్వాత ఏపీ ఆర్ధికంగా బలోపేతం: జ్యోతిష్య పండితుడు

రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితుడు చెప్పారు. 2020 జూలై మాసంలో కొన్ని చోట్ల భూకంపాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కొన్ని సమయాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ మాసంలో చెన్నై, ముంబై లాంటి ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు.

అంతకుముందు  దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శార్వరి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు.