హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న పలువురు జర్నలిస్టులు గత ఎన్నికల్లోనే కాకుండా ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) టికెట్లు ఆశించారు. గత ఎన్నికల్లో టికెట్ లభించకపోయినప్పటికీ ఓపికగా చాలా మంది ఈ ఎన్నికల వరకు నిరీక్షించారు. 

వారిలో కొందరికి కేసీఆర్ నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం చాలా మంది జర్నలిస్టులు పనిచేసినప్పటికీ, టీఆర్ఎస్ కూ తనకూ దగ్గర ఉంటూ వచ్చిన జర్నలిస్టులను మాత్రమే కేసీఆర్ ఆదరిస్తూ వచ్చారు. 

కేసీఆర్ ఆదరణకు పాత్రులైన జర్నలిస్టుల్లో క్రాంతి కిరణ్, పల్లె రవి కూడా ఉన్నారు. క్రాంతి కిరణ్ కు ఆందోల్ టికెట్ దక్కింది. ఆపద్ధర్మ మంత్రి కేటీ రామారావుకు అత్యంత సన్నిహితుడు కావడం వల్లనే బాబూ మోహన్ ను పక్కన పెట్టి క్రాంతికి ఆందోల్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు. 

పల్లె రవి తెలంగాణ ఉద్యమ కాలంలో ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూస్తుండేవారు. ఆయనకు ఆ సమయంలో మునుగోడు అసెంబ్లీ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు. దాంతో అసంతృప్తికి గురైన పల్లె రవి కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు రాయడం ప్రారంభించారని అంటారు. ఈ క్రమంలో  పల్లె రవి ఉద్యోగం నుంచి బయటకు వచ్చారు.

ఆ తర్వాత పల్లె రవి కేసీఆర్ కు దగ్గరయ్యారు. తనకు ఏదో ఓ నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. అందుకు అనుగుణంగానే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కానీ ఆయన కేసీఆర్ మొండిచేయి చూపించారు. ఈసారి ఎన్నికల్లోనైనా మునుగోడు టికెట్ లభిస్తుందని ఆయన ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది.

క్రాంతికి సరిజోడుగా తెలంగాణ ఉద్యమంలోనూ ఆ తర్వాత టీఅర్ఎస్ తోనూ ఉన్నప్పటికీ తనను విస్మరించడాన్ని పల్లె రవి జీర్ణించుకోలేదని అంటారు. ఆ కారణంగానే ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసు కండువా కప్పుకున్నారు. 

ఆయనతో పాటు  జాగృతినేత అధికార ప్రతినిధి  దొనికేన కుమార స్వామి,  రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్,  కమలాకర్ గౌడ్,బోళ్ల రాజు ముదిరాజ్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

బాబూ మోహన్ ను కాదని టికెట్: ఎవరీ క్రాంతి?

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

జర్నలిస్టు క్రాంతి పై బాబుమోహన్ ఫైర్