నేడే సీపీఐ తెలంగాణ రాష్ట్రసమితి కార్యదర్శి ఎన్నిక: పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని మధ్య తీవ్ర పోటీ
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి పదవికి పోటీ నెలకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావు, నల్గొండ జిల్లాకు చెందిన పల్లా వెంకట్ రెడ్డిలు ఈ పదవికి పోటీ పడుతున్నారు.
హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహసభల్లో రాష్ట్ర సమితి కార్యదర్శిని బుధవారం నాడు ఎన్నుకోనున్నారు. రాష్ట్ర సమితి కార్యదర్శి ఎన్నిక కోసం మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావులు పోటీ పడుతున్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను 131 నుండి 101కి తగ్గించారు.
ఖమ్మం, హైద్రాబాద్ కు చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ నల్గొండ జిల్లా నేతలు పల్లా వెంకట్ రెడ్డికి మద్దతిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శిగా చాడ వెంకట్ రెడ్డి రెండు దఫాలుగా కొనసాగారు. ఈ దఫా చాడ వెంకట్ రెడ్డి స్థానంలో బాధ్యతల కోసం పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరాలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి కూనంనేని సాంబశివరావు, మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పల్లా వెంకట్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు.
2018 ఎన్నికల సమయంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి పోటీకి సీపీఐ ప్రయత్నించింది.కాంగ్రెస్ పార్టీతో పొత్తు నేపథ్యంలో ఈ స్థానాన్ని కాంగ్రెస్ తీసుకుంది. దీంతో కూనంనేని సాంబశివరావు పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు విజయం కోసం పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.ఇవాళ మధ్యాహ్నం సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శిని ఎన్నుకుంటారు. 45 నిమిషాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నల్గొండలో సీపీఐ రాష్ట్ర మహసభలు జరిగిన సమయంలో కూడా రాష్ట్ర సమతి కార్యదర్శి ఎన్నిక విషయమై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఒక్క రోజు రాత్రి మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు సుదీర్థంగా చర్చించారు. రాత్రి ప్రారంభమైన చర్చల తర్వాత తెల్లవారుజామున రాష్ట్ర సమితి ఎన్నికున్నారు.
ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాన రాష్ట్రంలో పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావులు రాష్ట్ర సమితి కార్యదర్శి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అందుతాయో ఇవాళ మధ్యాహ్నం తేలనుంది.
2018 లో జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో కమ్యూనిష్టు పార్టీలకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో స్థానంలో విజయం సాధించాయి. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఈ రెండు పార్టీలు మద్దతును ప్రకటించాయి.