భూపాల్‌పల్లి జిల్లాలో పలిమెల పోలీస్ స్టేషన్ గోదావరి వరదలో చిక్కుకుపోయింది. 70 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, 20 మంది కానిస్టేబుళ్లు జలదిగ్భంధంలో ఇరుక్కుపోయారు. 

తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తాజాగా భూపాల్‌పల్లి జిల్లాలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ముంచెత్తడంతో పలిమెల పోలీస్ స్టేషన్ నీట మునిగింది. దీంతో 70 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, 20 మంది కానిస్టేబుళ్లు జలదిగ్భంధంలో చిక్కుకుపోయారు. వరద ఉద్ధృతితో మేడిగడ్డ కంట్రోల్ రూంలో చిక్కుకున్నారు అధికారులు. పై అధికారులకు సమాచారం అందడంతో వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు.. Telangana రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో అతి Heavy Rains కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం నాడు రాత్రిలోపుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ALso REad:తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ వార్నింగ్

ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షాలతో పాటు గోదావరి నదికి వరద పోటెత్తడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..ఈ జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున విద్యా సంస్థలకు ప్రభుత్వం శనివారం వరకు సెలవులను పొడిగించింది. సోమవారం నుండి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ప్రజలంతా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.