పొట్టకూటికోసం భిక్షాటన చేసుకుంటున్న ఓ బాలికనూ వదిలిపెట్టలేదు ఓ కామాంధుడు. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేయడానికి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు దుండగుడు.
కామారెడ్డి: అభం శుభం తెలియని చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. తన శారీరక సుఖం కోసం ఆడ బిడ్డల మానాన్ని, కొన్నిసార్లు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. చివరకు పొట్టకూటికోసం భిక్షాటన చేసుకుంటున్న చిన్నారులను కూడా మృగాళ్లు వదిలిపెట్టలేదు. తాజాగా కామారెడ్డి జిల్లా (kamareddy district)లో భిక్షాటన చేసుకుంటున్న ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో కామాంధుడు.
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబం కామారెడ్డి పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. రోజూ మాదిరిగానే ఈ కుటుంబానికి చెందిన చిన్నారి భిక్షాటన కోసం బయటకు వెళ్లింది. ఇలా రామారెడ్డి రోడ్డులో భిక్షాటన చేస్తున్న బాలికపై పెయింటర్ గా పనిచేసే కనకయ్య కన్ను పడింది. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకోవాలని చూసాడు.
బిక్షాటన చేస్తున్న బాలికకు కనకయ్య డబ్బులు ఆశచూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి యత్నించాడు. అతడి చేష్టతకు భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్న పెయింటర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తప్పించుకోకుండా కట్టేసి దేహశుద్ది చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అఘాయిత్యానికి యత్నించిన దుర్మార్గుడు కనకయ్య రామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు.
ఇదిలావుంటే చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే బుద్దితప్పి స్కూల్లోనే బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. చదువుల తల్లి నిలయమైన పాఠశాలలోనే ఒంటరిగా కనిపించడమే చిన్నారిపై నీచంగా ప్రవర్తించాడు కీచక ఉపాధ్యాయుడు.
పాతబస్తీలోని ఫలక్ నుమా భారత్ కోట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో అష్వాఖ్ అహ్మద్(35) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారి(10) నాలుగో తరగతి చదువుతోంది. రోజూ మాదిరిగానే గత శనివారం కూడా బాలికను ఆమె తాత స్కూల్ వద్ద వదిలివెళ్లాడు. స్కూల్ ప్రారంభానికి చాలా సమయం వుండటంతో మిగతా విద్యార్థులెవ్వరూ రాకపోవడంతో తరగతి గదిలో చిన్నారి ఒంటరిగా వుంది. ఇదే సమయంలో స్కూల్ కి వచ్చిన ఉపాధ్యాయుడు అష్వాఖ్ బాలిక ఒంటరిగా వుండటాన్ని గమనించాడు. దీంతో అతడికి పాడుబుద్ది కలిగింది.
బాలిక వద్దకు వెళ్లిన ఈ కీచకుడు మాయమాటలు చెబుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో అతడి పాడుబుద్దిని గుర్తించిన చిన్నారి తరగతి గదిలోంచి బయటకు వచ్చి అదే స్కూల్లో చదివే తన సోదరుడికి విషయం తెలిపింది. అతడు తండ్రికి ఫోన్ చేసి చెల్లితో టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తెలిపాడు. వెంటనే స్కూల్ వద్దకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు టీచర్ అష్వాఖ్ ను నిలదీసారు. అతడు ఏదో చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నించినా బాలిక తండ్రి వెనక్కి తగ్గకుండా ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
