హైదరాబాద్: ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మ తన సీటును త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెసు సిద్ధపడింది. 

కోదాడ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడానికి వీలుగా పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపికి మక్తల్, దేవరకద్ర సీట్లను కాంగ్రెసు కేటాయించింది. మహబూబ్ నగర్, జడ్చర్ల సీట్లలో తమ అభ్యర్థులను పోటీకి దించి ఇబ్రాహింపట్నం టీడీపి కేటాయించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేయనున్నారు. ఉప్పల్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సత్తుపల్లి, ఖమ్మం, దేవరద్ర, మక్తల్, అశ్వారావుపేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, కోదాడ, బాల్కొండ సీట్లను కాంగ్రెసు టీడీపికి ఇవ్వనుంది.

దాంతో వచ్చే ఎన్నికల్లో పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ సీటును వదులుకుంటారని సమాచారం. నిజానికి, సికింద్రాబాద్ సీటు నుంచి విజయశాంతిని పోటీకి దించాలని తొలుత కాంగ్రెసు అధిష్టానం భావించింది. అయితే, ఆ సీటును పొత్తులో భాగంగా టీడీపికి కేటాయించనున్నారు.