హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం వద్ద శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి షాక్ తగిలింది. గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ఆమెను అనుమతించలేదు. ప్రగతి భవన్ లో నరసింహన్ కు వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. 

నరసింహన్ వీడ్కోలు సన్మానానికి హాజరు కావడానికి వచ్చిన పద్మా దేవేందర్ రెడ్డిని లోనికి అనుమతించలేదు. మంత్రులు, ఐపిఎస్ అదికారులు, ఐఎఎస్ అధికారులకు మాత్రమే అనుమతి ఉందని, మిగతావారికి అనుమతి లేదని సంబంధిత అధికారులు పద్మా దేవేందర్ రెడ్డికి చెప్పారు. దాంతో ఆమె వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. 

కాగా, టీఆర్ఎస్ లో తన వ్యాఖ్యల ద్వారా కలకలం రేపిన మంత్రి ఈటల రాజేందర్ నరసింహన్ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. నరసింహన్ స్థానంలో ఆమె గవర్నర్ గా నియమితులయ్యారు. 

సుదీర్ఘ కాలం గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.