ఐదు రాష్ట్రాలతో పాటు తెలంగాణ లో కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలరకు ముందు సెమిఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈవీఎం యంత్రాలపై తమకు సమ్మకం లేదని...వివిపాటులోని ఓటర్ స్లిప్ లను కూడా లెక్కించాలని కొందరు అభ్యర్థులు ఇప్పటికే ఈసీని కోరారు. తాజాగా అదే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈసీకి ఓ బహిరంగ లేఖ రాశారు.

తమకు కూడా ఈవీఎం యంత్రాలపై అనుమానం కలుగుతోందని...కాబట్టి వివిపాట్ యంత్రంలోని ఓటర్ స్లిప్ లను కూడా లెక్కించిన తర్వాతే ఫలితాలను వెల్లడించాలని ఈసిని కోరారు. దీంతో ప్రజల్లో వున్న అనుమానాలు తొలగి ఎన్నికల సంఘం, పోలింగ్ వ్యవస్థపై నమ్మకం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఇలా చేయడం వల్ల తాము ఎన్నుకున్న ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిందన్న గౌరవం ప్రజల్లో కలుగుతుందన్నారు. కాబట్టి ఈ దిశగా చర్యలు  తీసుకుంటారని  కోరుకుంటున్నమంటూ విద్యార్థులు తమ లేఖలో పేర్కొన్నారు.