టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి: న్యూఢిల్లీలో ఓయూ విద్యార్థి సంఘం నేతల ఆందోళన
తమకు గతంలో టిక్కెట్ల కేటాయింపులో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఓయూ విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు.ఈ విషయమై ఓయూ విద్యార్థి సంఘం నేతలు న్యూఢిల్లీలో ఆందోళన చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగుతున్న వార్ రూమ్ బయట ఆదివారంనాడు ఓయూ విద్యార్ధి సంఘం నేతలు నిరసనకు దిగారు.త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది.టిక్కెట్లను ఆశిస్తున్న నేతలు కొందరు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఓయూ విద్యార్ధి జేఏసీ నేతలు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు యువతకు టిక్కెట్లు కేటాయించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు కోరుతున్నారు.
అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసి కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి జాబితాను పంపనున్నారు.ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో ఓయూ విద్యార్ధి జేఏసీకి టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ దఫానైనా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు.
ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తుంది. యూత్ కాంగ్రెస్, మహిళా, బీసీ, కమ్మ సామాజిక వర్గాల నుండి టిక్కెట్ల కోసం డిమాండ్లు నెలకొన్నాయి. మరో వైపు గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేలో గెలుపు అవకాశాలపై ఉన్న అభ్యర్థులకే టిక్కెట్టును కేటాయించనున్నారు.
also read:టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి: కాంగ్రెస్‌ను కోరుతున్న మహిళా, యూత్ విభాగాలు
రానున్న వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలని రాష్ట్ర నేతలు బావిస్తున్నారు. ఇప్పటికే 45 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. మరో వైపు 70 స్థానాల్లో వడపోత పూర్తైంది. ఇతర పార్టీల నుండి వచ్చిన అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపుతో పాటు గెలుపు గుర్రాలకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని చర్చించనున్నారు.