హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, విప్లవ రచయితల సంఘం కార్యదర్శి కాశీంను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వెల్ పోలీసులు ఆయనను శనివారంనాడు అరెస్టు చేశారు. 

ఇటీవలే ఆయన విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పోలీసులు శనివారం ఉదయం ఓయు క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించాయి. 

కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, రెండు సంచల విప్లవ సాహిత్యం, కరపత్రాలను పోలీసుుల స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనను గజ్వెల్ కు తరలించారు. కాశీం అరెస్టును విద్యార్థులు ఖండించారు. ఓయులోని కాశీం నివాసం ఎదుట విద్యార్థులు ఆందోలెనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

Also Read: ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసు సోదాలు

కాగా, కాశీం అరెస్టుపై ఆయన భార్య స్నేహలత తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టుపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని ఆమె ఓ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. 2016లో పోలీసులు తమ ఇంటిలో తనిఖీలు చేశారని, అప్పుడు తప్పుడు కేసు బనాయించారని, ఆ కేసులో ఇప్పుడు అరెస్టు చేశారని ఆమె అన్నారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తన భర్తను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. తలుపులు పగులగొట్టి పోలీసుుల ఇంట్లోకి ప్రవేశించారని ఆమె ఆరోపించారు.