కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే.. వారి పక్కన ఎప్పుడూ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటారు. సదరు నేతతో దశాబ్ధాల అనుబంధం వారి సొంతం. ఉదాహరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కన సూరీడు ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవారు.

తాజాగా మరణించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి అలాంటి నమ్మినబంటు ఒకరు ఉన్నారు. ఆయనే వెంకట్రామిరెడ్డి. హయత్‌నగర్‌కు చెందిన ఆయన 1980లో జైపాల్ రెడ్డి జనతాపార్టీలో చేరినప్పటి నుంచి తోడు నీడగా వుంటూ వస్తున్నారు.

అంగవైకల్యంతో ఇబ్బందిపడే జైపాల్ రెడ్డికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. ఇంట్లో కానీ.. ఆఫీసులో కానీ జరిగిన విషయాల్లో ఒక్కటి కూడా బయటకు వెళ్లనిచ్చేవారుకాదు.

తనపై చూపే విశ్వాసానికి బహుమానంగా జైపాల్‌రెడ్ది కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డిని తన ఓఎస్డీగా నియమించుకున్నారు. 37 సంవత్సరాల పాటు జైపాల్‌రెడ్డిని కనిపెట్టుకుని వున్న వెంకట్రామిరెడ్డికి.. ఇక ఆయన లేరని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.