తాను చనిపోతే తనకు ఎవరూ అంత్యక్రియలు చేయరేమో అని భావించాడు. అందుకే ముందుగానే తన అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చి....ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఫిల్మ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫిల్మ్ నగర్ కి చెందని విజయ్ ఓ అనాథ. తనకంటూ  ఎవరూ లేరు.  ఒంటరి జీవితంపై విరక్తి చెందిన అతను తన జీవితాన్ని మధ్యలోనే ముగించాలని అనుకున్నాడు. అయితే... తాను చనిపోతే తనకు ఎవరూ దహన సంస్కారాలు కూడా చేయరు కదా అని భావించాడు. అందుకే ముందుగానే అనాథలకు అంత్యక్రియలు నిర్వహించే సంస్థల గురించి తెలుసుకున్నాడు. 

ఇంతకాలంగా క్యాబ్ డ్రైవర్ గా తాను సంపాదించిన రూ.6వేలను సదరు సంస్థకు అందించాడు. అనాథ శవాలు దొరికితే అంత్యక్రియలు నిర్వహించాలని కోరాడు. మంగళవారం బల్కంపేట నేచర్ క్యూర్ ఆస్పత్రి సమీపంలో ఓ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు లేఖ రాశాడు. ఆ లేఖలో తాను డబ్బులు ఇచ్చిన సంస్థలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరాడు.

అతను కోరుకున్నట్లుగానే పోలీసులు సదరు సంస్థకు సమాచారం అందించి... అందులోనే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా... ఈ ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.