ఆన్‌లైన్ రుణాలకు యువత బలిపోతోంది. వేధింపులు తాళలేక వరుస పెట్టి ఆత్మహత్యలకు పాల్పుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణలో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు.

దీంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. చట్టబద్ధత లేని యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రుణాలు అందించే యాప్స్‌కు ఆర్బీఐ రూల్స్‌ వర్తిస్తాయని తెలిపారు.

చలామణిలో ఉన్న యాప్‌లలో అధికశాతం రిజర్వ్ బ్యాంక్‌లో నమోదు కాలేదన్నారు. ఇలాంటి యాప్‌లలో చాలా వరకు చైనాకు చెందినవే ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.

యాప్‌ రుణాల కోసం బ్యాంక్‌, ఆధార్‌, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని ఆయన కోరారు. వేధింపులకు పాల్పడే యాప్‌లపై ఫిర్యాదు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.