మూసాపేటలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ ట్రాలీ కార్మికుడు సోమవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్(35) హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన శ్రీనివాస్.. సోమవారం ఉదయం హైదరాబాద్ కి వచ్చాడు. ఈ రోజు ఉదయం బియ్యం మూటతో మూసాపేటలోని లక్ష్మీ కళ థియేటర్ వద్ద బస్సు దిగాడు.

రోడ్డుదాటే క్రమంలో ముషీరాబాద్ డిప్ కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.  అతని తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ ట్రాలీ కార్మికులందరూ ప్రమాద స్థలికి చేరుకొని ఆందోళన చేపట్టారు. 

బస్సు డ్రైవర్ ని అరెస్టు చేయాలని, మృతుడి కుటుంబసభ్యలకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనతో ఆ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.