ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, పాలకొండూరు మండలం, కుమదవల్లి గ్రామానికి చెందిన పోతరాజు సురేశ్ అనే యువకుడు చదువు వంటబట్టలేదు

ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, పాలకొండూరు మండలం, కుమదవల్లి గ్రామానికి చెందిన పోతరాజు సురేశ్ అనే యువకుడు చదువు వంటబట్టలేదు. దీంతో కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

అయితే అతని విలాసాలకు వస్తున్న జీతం ఏమాత్రం చాలకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలో 2007లో ఒక ఇంట్లో చోరికి పాల్పడ్డాడు. ఎక్కువ మొత్తంలో డబ్బు కళ్లచూసే సరికి దానినే అలవాటుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేసి చోరీకి పాల్పడుతూ వచ్చాడు.

ఒకసారి అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినప్పటికీ సురేశ్‌లో ఎలాంటి మార్పు రాకపోగా.. తిరిగి దొంగతనాలు కొనసాగించాడు. ఇతనిపై మేడ్చల్, ఘట్కేస్కర్, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో 40 చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇతనిపై నిఘా పెట్టిన మల్కాజ్‌గిరి పోలీసులు ఆనంద్‌బాగ్ వద్ద నిన్న అదుపులోకి తీసుకున్నారు.. సురేశ్ వద్ద నుంచి రూ.3,90,000 విలువ గల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు.