తెలంగాణ సర్కారుకు స్కోచ్ అవార్డుల పంట వైద్య శాఖ చేపట్టిన కేసిఆర్ కిట్లకు స్కోచ్ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ సర్కారుకు స్కోచ్ అవార్డుల పంట పండుతున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా తెలంగాణ సర్కారుకే స్కోచ్ అవార్డులు వచ్చాయి. మంత్రి కేటిఆర్ కు అవార్డు రాగా సివిల్ సప్లై కమిషనర్ సివి ఆనంద్ కు కూడా స్కోచ్ వచ్చింది. తాజాగా కెసిఆర్ కిట్ల ప‌థ‌కానికి కూడా స్కోచ్‌ అవార్డు రావడంతో వైద్య శాఖ సంబరాల్లో ఉంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఏడాది జూన్ 3వ తేదీన ప్రారంభించిన కెసిఆర్ కిట్ల ప‌థ‌కానికి 2017 స్కాచ్ ఆర్డ‌ర్ ఆఫ్ మెరిట్ అవార్డు ద‌క్కింది. ఈ అవార్డుని కొత్త ఢిల్లీ లోని ర‌ఫి మార్గ్‌లో గ‌ల కానిస్టిట్యూష‌న్ క్ల‌బ్ ఆఫ్ ఇండియాలో జ‌రిగిన 49వ స్కాచ్ స‌మ్మిట్ కార్య‌క్ర‌మంలో చీఫ్ కమిష‌న‌ర్ బ‌జాజ్‌, ఫైనాన్స్ ఎక్స్‌ప‌ర్ట్ బ‌న్సాల్ చేతుల మీదుగా కెసిఆర్ కిట్ల ప‌థ‌కం స్పెష‌ల్ ఆఫీస‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి టీమ్ శుక్ర‌వారం స్వీక‌రించింది. కాగా కేసీఆర్ కిట్ల పథకం టీం ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అభినందించారు. ప్ర‌జ‌ల కోసం ప్రారంభించే కొత్త‌, వినూత్న ప‌థ‌కాల అమ‌లు తీరుని ప‌రిశీలించి, వాటికి జ్యూరీ స‌భ్యులు వేసే మార్కుల ఆధారంగా ఈ అవార్డుకి ఎంపిక‌లు చేస్తారు. అలా ప్ర‌తి ఏటా ఇచ్చే అవార్డు ఈ సారి తెలంగాణ ప్ర‌భుత్వంలోని వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన కెసిఆర్ కిట్ల ప‌థ‌కానికి వ‌చ్చింది.

కెసిఆర్ కిట్ల ప‌థ‌కం కింద ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో ప్ర‌స‌వించే ప్ర‌తి మ‌హిళ‌కు నాలుగు విడ‌త‌లుగా అబ్బాయి పుడితే రూ.12వేలు, అమ్మాయి పుడితే అద‌నంగా వెయ్యి రూపాయ‌ల‌ను క‌లుపుకుని రూ.13వేలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతేగాక రూ.2వేల విలువైన కెసిఆర్ కిట్ల‌ను కూడా ఇస్తున్న‌ది ప్ర‌భుత్వం. ఈ కిట్ల‌లో పిల్ల‌ల‌కు, త‌ల్లుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కూడా ఇస్తున్న‌ది. గ‌ర్భం దాల్చిన నాటి నుంచి ప్ర‌స‌వానంత‌రం పిల్ల‌ల టీకాలు ఇచ్చే వ‌ర‌కు కూడా ఈ ప‌థ‌కం కింద పుట్టిన బిడ్డ‌కు ప్రేమ‌తో్, అమ్మ‌ల‌కు ఆప్యాయ‌త‌తో కెసిఆర్ అందిస్తున్నఅద్భుత ప‌థ‌కంగా కెసిఆర్ కిట్ల ప‌థ‌కం నిల‌వ‌డం ముదావ‌హం. కాగా, ఈ ప‌థ‌కం ప‌క‌డ్బందీగా అమ‌లు అవ‌తున్న‌దృష్ట్యా ఈ అవార్డు ద‌క్క‌డం విశేషం.

తెలంగాణ ప్ర‌భుత్వంలోని మున్సిప‌ల్‌, సివిల్ స‌ప్ల‌యిస్‌, స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ‌ల‌కు కూడా ప‌లు అవార్డులు ద‌క్కాయి. దేశంలో ప‌లు అవార్డులు ద‌క్కిన రాష్ట్రాల్లో మొద‌టి మూడు స్థానాల్లో తెలంగాణ ఉండ‌టం విశేషం. కాగా మొద‌టి రెండు స్థానాల్లో రాజ‌స్థాన్‌, హ‌ర్యానా ఉన్నాయి. మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కేసీఆర్ కిట్ల పథకం టీం కి అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టీం ని ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. కేసీఆర్ కిట్ల పథకం టీం ని ఆదర్శంగా తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు సూచించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి