తెలంగాణలో చంద్రబాబుకి మరో షాక్ తగిలింది.  టీడీపీ మహేశ్వరం మండల అధ్యక్షుడు కర్రోళ్ల  చంద్రయ్య  ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా  పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా... ఈ మహాకూటమి కారణంగా మహేశ్వరం అసెంబ్లీ స్థానం టీడీపీకి దక్కలేదు. ఈ నేపథ్యంలోనే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. త్వరలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి నిర్ణయం మేరకు ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తామన్నారు.

మహేశ్వరం స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కేటాయించగా.. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీకి సిద్ధమౌతున్నారు. టీడీపీ సీనియర్ నేతలు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వీరు వినకుండా రాజీనామా చేయడం గమనార్హం. వీరు టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.