తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన మరో యాగం నిర్వహించతలపెట్టారు. ఆ రోజు ఉదయం 9గంటలకు  గంటలకు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆయుష్ హోమం, చండీహోమం, గణపతిహోమం పూజలు నిర్వహించనున్నారు.  ఈ విషయాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  వివరించారు.

సోమవారం జలవిహార్‌లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జలవిహార్‌లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుతామన్నారు. హమాలీ బస్తీలో రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. 

జలవిహార్‌లో కళాకారులతో వివిధ కళారూపాల ప్రదర్శన ఉంటుందన్న తలసాని.. సీఎం కేసీఆర్‌పై రూపొందించిన రెండు పాటలను విడుదల చేస్తామన్నారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ వేడుకలకు పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆహ్వానితులేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జరిగే చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ కవిత హాజరవుతారని తలసాని వెల్లడించారు.