నల్గొండ జిల్లాలో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన అబ్బవతి మల్లమ్మ అనే వృద్ధురాలికి నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు.. పిల్లలందరికి పెళ్లిళ్లు చేసిన ఆమె అబ్థుల్లాపూర్ మెట్‌లోని కుమారుడి దగ్గర ఉంటోంది.

దీపావళీ సందర్భంగా నోముల నిమిత్తం మల్లమ్మ కుమారుడు, కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామానికి చేరుకుంది.. పండగ అయిపోయిన తర్వాత గురువారం ఉదయం అందరూ తిరిగి వెళ్లగా.. మల్లమ్మ ఇంట్లోనే ఉండిపోయింది.

వీరి పక్కింట్లో బిహార్ రాష్ట్రానికి చెందిన రాజేశ్యాం అనే వ్యక్తి గురువారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మల్లమ్మ చనిపోయి పడివుంది. దీంతో విషయాన్ని వెంటనే అతడి కుమారుడికి తెలిపాడు. అతను పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

వృద్ధురాలి ముఖంపై పసుపు, కుంకుమతో పాటు నూనె కూడా పూసి ఉండటం, మేక పేగులను, దుస్తులను నోట్లో కుక్కి.. గొంతు నులిమి చంపారు. క్షుద్రపూజల నిమిత్తం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు మృతురాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరా హత్య జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయకపోవడంతో పోలీసులు ఆ దిశగా ఆరా తీస్తున్నారు.

క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్‌లతో దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.. ఓ రోజు ముందు కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా పండుగ చేసుకున్న మల్లమ్మ హత్యకు గురికావడం తోటి గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది. గతంలో కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద క్షుద్రపూజలు చేసేవారని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు.