తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్ కు మద్దతు ఇస్తూ వచ్చిన నాయకులు ఇప్పుడు ఎన్నికల్లో కేసిఆర్ ను ఢీకొట్టేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రధాన నాయకుడైనప్పటికీ ఆ నాయకుల పాత్ర కూడా అత్యంత ముఖ్యమైందే.

హైదరాబాద్: పాత మిత్రులే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై కత్తులు నూరుతున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్ కు మద్దతు ఇస్తూ వచ్చిన నాయకులు ఇప్పుడు ఎన్నికల్లో కేసిఆర్ ను ఢీకొట్టేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రధాన నాయకుడైనప్పటికీ ఆ నాయకుల పాత్ర కూడా అత్యంత ముఖ్యమైందే.

ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్న విజయశాంతి, కాంగ్రెసుకు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడిన గద్దర్, తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసి మహా కూటమిలో చేరిన కోదండరామ్ కేసీఆర్ కు పాత మిత్రులే. ఉద్యమంలో వారంతా కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు. విజయశాంతి నుంచి కాకున్నా మిగతా ఇద్దరి నుంచి కేసీఆర్ తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా బేషరతు మద్దతు కోరారని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కోసం వారు కేసిఆర్ కు దాదాపుగా బేషరతు మద్దతు ఇచ్చినవారే. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయి. ఉద్యమ పార్టీగా ఉంటూ వచ్చిన టీఆర్ఎస్ ఒక్కసారిగా మిగతా రాజకీయ పార్టీల రంగును పూసుకుంది. 

తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నాయకులను కూడా పార్టీలో చేర్చుకుంది. కేసీఆర్ బలాన్ని కూడగట్టి ఇతర రాజకీయ పార్టీలను దెబ్బ తీయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించారు. వారు తెలంగాణ ఉద్యమంలో సానుకూల పాత్ర పోషించారా, వ్యతిరేక పాత్ర పోషించారా అనే విషయంతో నిమిత్తం లేకుండా ఆయన ఆ పనిచేశారు తలసాని శ్రీనివాస యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని అందుకు పరాకాష్టగా చెబుతారు.

అంతేకాకుండా, ప్రభుత్వ విధానాలు కోదండరామ్, గద్దర్ వంటి నాయకులకే కాకుండా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజాస్వామికవాదులకు చాలా మందికి నచ్చడం లేదు. వలసలను ప్రోత్సహిస్తూ డబుల్ బెడ్రూం ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు వంటి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను తన వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేశారు. తాను తిరుగులేని నాయకుడిగా ముందుకు వచ్చారు. ప్రజల్లో తనకు తిరుగులేదని భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహా కూటమి ఏర్పడి కేసిఆర్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఎంత కాదన్నా ఇది కేసీఆర్ కు మింగుడు పడని విషయమే.

అదలా వుంచితే, కేసీఆర్ ను గజ్వెల్ లో ఎదుర్కోవడానికి తాను సిద్ధమంటూ గద్దర్ ప్రకటిస్తున్నారు. మహా కూటమిలో ఏకాభిప్రాయం వచ్చి ఆయనను పోటీకి దింపినా ఆశ్చర్యమేమీ లేదు. కోదండరామ్ కేసిఆర్ కు కొరకరాని కొయ్యగానే తయారయ్యారు. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసిఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెసు ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. 

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల తీరు ఎలా ఉన్నప్పటికీ కొత్త శక్తులు మహా కూటమికి ప్రాణం పోసే అవకాశం లేకపోలేదు. అంటే, గతంలో కేసిఆర్ తో సన్నిహితంగా ఉంటూ దూరమైనవారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కేసీఆర్ కు వామపక్ష, ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేస్తున్నవారి పట్ల కాస్తా చిన్న చూపు అని అంటారు. వారి వల్ల ఊదు కాలదు పీరు లేవదని కూడా ఆయన భావిస్తారని ప్రచారంలో ఉంది.

తనకు బేషరతుగా మద్దతు ప్రకటించడానికి, తాను చెప్పినదాన్ని వ్యతిరేకించినవారిని ఆయన పార్టీలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా దూరం పెడుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గాదె ఇన్నయ్య ఆయనకు ఎప్పుడో దూరమయ్యారు. ఆయన ప్రస్తుతం టిజెఎస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా చెబుకుంటూ పోతే ఒక్కో దశలో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండి, ఆ తర్వాత దూరమైనవారంతా ఇప్పుడు మహా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

అయితే, కేసిఆర్ ప్రధానంగా విపక్షాల ఓట్ల చీలిక మీద ఆధారపడినట్లు కనిపిస్తున్నారు. సిపిఎం నేతృత్వంలోని బిఎల్ఎఫ్ ఆ ఓట్లను చీల్చడదంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన భావిస్తూ ఉండవచ్చు. అలాగే, పవన్ కల్యాణ్ గానీ, జగన్ గానీ తెలంగాణ ఎన్నికల్లో వేలు పెడుతారా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ఏయే శక్తులు కేసిఆర్ కు అనుకూలంగా పనిచేస్తాయనేది తేలాల్సి ఉంది.