మహబూబాబాద్: జన్మనిచ్చిన తల్లిదండ్రులను వీధిపార్లజేశారు కొడుకులు. ఆస్తి ఇవ్వడం లేదన్న అక్కసుతో తాళికట్టిన భార్యల మాటలు విని కన్నతల్లిదండ్రులను రోడ్డున పడేశారు కొడుకులు. అంతేకాదు వారు ఉంటున్న ఇంటిని సైతం కూల్చేసి దాడికి పాల్పడ్డారు.  

నిలువ నీడ కూడా లేకుండా చేసి వారిని వీధి పాల్జేశారు. కొడుకులు, కోడళ్లు చేసిన నిర్వాకంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ వృద్ధి దంపతులు జాయింట్ కలెక్టర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొడుకుల నుంచి తమను రక్షించాలంటూ వేడుకున్నారు. 

ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల ఇల్లు కూల్చి వారిపై దాడి చేసిన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే డోర్నకల్ కు చెందిన దుర్గయ్య, లింగమ్మ దంపతులు. 

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేయడంతో ఆస్తిని సైతం కొడుకులు, కూతుళ్లకు పంచేశారు. ఇక తమ జీవనాధారం కోసం ఆ వృద్ధ దంపతులు ఎకరం పొలం, 500 చదరపు గజాల్లో ఉన్న ఇంటిని ఉంచుకున్నారు. 

ఆ ఆస్థిపై కన్నేసిన కొడుకులు నిత్యం తల్లిదండ్రులను వేధించడం మెుదలుపెట్టారు. భార్యలతో కలిసి కన్న తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. రోజు తిడుతూ కొట్టేవారు. తాజాగా ఆ వృద్ధ దంపతులు ఉంటున్న ఇంటిని సైతం కూల్చేసి అక్కడ నుంచి తరిమేశారు. 

కొడుకులు, కోడళ్ల నిర్వాకాన్ని తట్లుకోలేకపోయిన ఆ వృద్ధ దంపతులు ఆందోళనకు గురయ్యారు. ఈ 70ఏళ్ల వయసులో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజావాణిలో జాయింట్  కలెక్టర్ డేవిడ్ కు ఫిర్యాదు చేశారు. 

తమ కొడుకులు, కోడళ్ల చిత్రహింసలను చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకులు కోడళ్ల బారి నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారా అన్న అంశంపై జేసీ ఆరా తీశారు. 

కొడుకులు, కోడళ్ల వేధింపులపై డోర్నకల్ పోలీస్‌స్టేషన్‌లో, ఊరిలోని పెద్దమనుషులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే తమ సమస్యను పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు.  అయితే పెద్దమనుషులు మాత్రం కొన్ని సూచనలు చేశారని చెప్పుకొచ్చారు. 

కొడుకులకు రూ.3లక్షలు చెల్లించి ఇంటిలో ఉండాలని ఆదేశించారని చెప్పుకొచ్చారు. తాము ఆ రూ.3లక్షలు కూడా ఇచ్చామని అవి తీసుకున్న కొడుకులు కోడళ్లు మళ్లీ దాడి చేయడం మెుదలుపెట్టారని అంతేకాకుండా తాము ఉంటున్న ఇళ్లును కూడా కూల్చేశారని వారు బోరున విలపించారు. వృద్ద దంపతుల ఫిర్యాదుపై స్పందించిన జేసీ డేవిడ్ విచారణ చేపట్టాలని వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.