మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వలేదంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటికి చెందిన ముగ్గురు ఉద్యోగులకు పై అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనలేదంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటికి చెందిన ముగ్గురు ఉద్యోగులకు మున్సిపల్ కమీషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హన్స్ ఇండియా’ కథనాన్ని ప్రచురించింది.
ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి వాట్సాప్ సందేశం పంపారు అధికారులు. అయితే కార్యాలయానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా టి రాజేశ్వరి (సీనియర్ అసిస్టెంట్), పున్నం చందర్ (జూనియర్ అసిస్టెంట్), మోహన్ (సిస్టమ్ మేనేజర్)లకు మెమోలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అటు ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ కూడా మండిపడింది. ఒక అవినీతి పరుడి పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పర్వదినమా, అంత మాత్రానికే చిన్న ఉద్యోగులపై ప్రతాపం చూపుతారా అంటూ ఫైర్ అయ్యింది. ఈ మేరకు సదరు మెమోను ట్వీట్ చేసింది.
