సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు చేస్తున్న ఆందోళన నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్ధులను మరోసారి చర్చలకు పిలిచారు అధికారులు. దీంతో  తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకట రమణ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసరకు చేరుకున్నారు.  

బాసర ట్రిపుల్ ఐటీ (basara iiit) విద్యార్ధులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు అధికారులు. ఈ క్రమంలో చర్చల కోసం ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకట రమణ. మరికాసేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అటు విద్యార్ధులతో మాట్లాడేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (indrakaran reddy) కూడా ట్రిపుల్ ఐటీకి రానున్నారు. 

కాగా.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (kcr) క్యాంపస్‌ను సందర్శించి తమ ఆందోళనను ముగించాలని కోరుతూ ఐఐఐటీ బాసరలోని విద్యార్థులు శుక్రవారం నాల్గవ రోజు తమ ఆందోళనను కొనసాగించారు. శ‌నివారం కూడా వారు నిర‌స‌న‌ల‌ను తెలుపుతున్నారు. క్యాంపస్‌లోని గేట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి ఎవరినీ లోపలికి అనుమతించకుండా విద్యార్థులను బంధించగా, విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బాస‌ర ఐఐఐటీ క్యాంప‌స్ కు చేరుకుంటున్న రాజకీయ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారిలో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఉన్నారు.

కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ సమీపంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కుడు, పార్ల‌మెంట్ స‌భ్యులు బండి సంజయ్‌ కుమార్‌ (bandi sanjay) అరెస్ట్‌ కాగా, పోలీసుల క‌ళ్లు క‌ప్పి క్యాంప‌స్ వ‌ద్ద‌కు చేరుకున్న రేవంత్ రెడ్డిని (revanth reddy) చివరి నిమిషంలో పోలీసులు అరెస్టు చేశారు. బాసర ఐఐఐటీకి వెళ్లే అన్ని రహదారులపై పోలీసులు గట్టి నిఘా ఉంచడంతో, రేవంత్ రెడ్డి మోటారుసైకిల్, ట్రాక్టర్‌పై ప్రయాణించడంతోపాటు పలు రవాణా మార్గాలను ఉపయోగించారు, ఆపై పోలీసులు అడ్డుకోకుండా రోడ్ల నుండి కొంత దూరం నడిచారు. అయితే, క్యాంపస్‌కు చేరుకోగానే అతడిని కూడా పట్టుకుని అరెస్టు చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (rahul gandhi) మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.