రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మార్గంలో మెట్రో నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మార్గంలో మెట్రో నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా శనివారం రోజున శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్ మ్యాప్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు పరిశీలించారు. రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు మెట్రో నిర్మాణానికి క్లిష్టమైన మార్గంగా ఉందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.
రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు మెట్రో నిర్మాణం క్లిష్ట తరమైనదని.. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం పెద్ద సవాలుతో కూడుకున్నదని అని చెప్పారు. మైండ్ స్పేస్ జంక్షన్‌లో అండర్ పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లై ఓవర్ ఉన్నాయి. మూడు అడ్డంకులను దాటేందుకు ప్రత్యేక స్పాన్ నిర్మాణం చేపట్టేలా పరిశీలన చేస్తామని చెప్పారు. ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్లను ఫ్లై ఓవర్ పిల్లర్లకు దూరంగా నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నగరానికి అనుసంధానిస్తూ నేరుగా మెట్రో సదుపాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 9వ తేదీన మెట్రో రెండోదశ నిర్మాణానికి మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 31 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ కోసంస్పెషల్ పర్పస్ వెహికల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఏర్పాటు చేయబడింది. ఇది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న మెట్రో సేవలతో పోల్చినప్పుడు ఈ కారిడార్ మరింత అధునాతన సౌకర్యాలను కలిగి ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 6,250 కోట్లు కాగా.. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
