Chief Minister Breakfast : కిచిడీ, ఉప్మా, పొంగలి..! తెలంగాణ సర్కార్ బడి పిల్లలకు దసరా కానుక
Chief Minister Breakfast : తెలంగాణ సర్కార్ బడి పిల్లలకు దసరా కానుక ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి 'ముఖ్యమంత్రి అల్పాహారం'లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.

Chief Minister Breakfast : తెలంగాణ సర్కార్ బడి పిల్లలకు దసరా కానుక ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి అల్పాహారం ’ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేస్తారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందించాలని కేసీఆర్ నిర్వహించారు.
ఈ పథకం భాగంగా మిల్లెట్‌తో కూడిన 'సాంబార్' నుంచి రుచికరమైన బియ్యం రవ్వ కిచిడీ, ఉప్మా వంటి పోషక విలువలున్న రోజువారీ మెనూను పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఉదయం 9.30 గంటలకు పాఠశాలలో అల్పాహారం తయారు చేసి విద్యార్థులకు వేడి వేడిగా వడ్డిస్తారు. దసరా కానుకగా అక్టోబర్ 24న ప్రారంభించనున్న అల్పాహార పథకం ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థ, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, మదర్సాల పరిధిలోని 28,807 పాఠశాలల్లోని 23,05,801 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్న ఈ పథకం తీరు తెన్నులకు పరిశీలించి వచ్చిన ఐఏఎస్ అధికారుల నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా దాదాపు 400 కోట్ల రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలుస్తోంది.
పని చేసే తల్లుల భారాన్ని తగ్గించడంతో పాటు పాఠశాలకు వెళ్లే పిల్లల పోషకాహార స్థితిని పరిష్కరించడానికి, రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి 10 వ తరగతి విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించనున్నది. గతంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థుల కోసం రాగి జావను ప్రారంభించింది. ప్రైమరీ , అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు ప్రతిరోజూ మిల్లెట్ ఆధారిత సప్లిమెంట్ బెల్లం కలిపి అందించబడుతుంది.
ఇప్పటికే ప్రభుత్వ, స్థానిక పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తోంది. భోజనంలో భాగంగా విద్యార్థులకు అన్నం, పప్పు, సాంబారు, కూరగాయల కూరలు, పప్పుదినుసుల కూరలు, వెజిటబుల్ బిర్యానీ, పులిహోర వంటి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారు.
భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా ప్రభుత్వం గుడ్లను చేర్చింది. వీటిని విద్యార్థులకు వారానికి మూడుసార్లు మధ్యాహ్న భోజనంలో అందజేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి. అయితే.. 9, 10వ తరగతి విద్యార్థులకు ఆహార ఖర్చుతో పాటు గుడ్ల ధరను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తుంది.
‘ముఖ్యమంత్రి అల్పాహారం పథకం’ మెను ఇలా
సోమవారం- గోధుమ రవ్వ ఉప్మా + చట్నీ
మంగళవారం- బియ్యం రవ్వ కిచిడీ + చట్నీ
బుధవారం- బాంబే రవ్వ ఉప్మా + సాంబార్
గురువారం- రవ్వ పొంగల్ + సాంబార్
శుక్రవారం- మిల్లెట్ రవ్వ కిచిడీ + సాంబార్
శనివారం- గోధుమ రవ్వ కిచిడీ + సాంబార్