Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ వారా? ఫ్యామిలీవారా?

నందమూరి కుటుంబంలో ఏం జరుగుతోంది? వైరుద్యాలు మళ్లీ తెరమీదికి వస్తున్నాయా? సాక్షాత్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మరోసారి రచ్చ మొదలయ్యిందా? బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న గొడవేంటి? ఫ్లెక్సీల్లో తన పక్కన కనిపిస్తే కూడా ఒప్పుకోవడం లేదా? ఇది బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వారా? ఫ్యామిలీ వారా?

NTR Death Anniversary : Balakrishna vs Junior NTR fans war? or family war ? - bsb
Author
First Published Jan 18, 2024, 11:20 AM IST

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, పార్టీ పెద్దలు, అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. ఘాట్ ను పూలతో అలంకరించారు. నందమూరి అభిమానులు తమ ప్రియతమ నాయకుడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబానికి మొదటినుంచి ఉన్న విభేదాలు తెలిసిన సంగతే. ఆ తరువాతి క్రమంలో కాస్త సద్దుమణిగాయి. హరికృష్ణ మరణం తరువాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఇద్దరూ ఒకటయ్యారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. జూనియర్ ఎన్టీఆర్ కు తాతా సీనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. యేటా ఆయన జయంతి, వర్థంతులకు తప్పనిసరిగా ఘాట్ కు వచ్చి నివాళులు అర్పిస్తుంటారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా వేకువజామున 4,5 గంటల ప్రాంతంలోనే వచ్చి వెడుతుంటారు. 

ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు...

గురువారంనాడూ అదే జరిగింది. అప్పటికే ఈ విషయం అవగాహన ఉన్న జూనియర్ అభిమానులు ఆయన వచ్చే ముందే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, హరికృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ఎన్టీఆర్ వచ్చి, వెళ్లిన తరువాత అభిమానులు కూడా వెళ్లిపోయారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ ఘాట్ కు వచ్చారు. నివాళులు అర్పించారు. అక్కడ నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు పేరుతో పెట్టిన ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. 

బాలకృష్ణ వెళ్లిపోయిన కాసేపటికే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, హరికృష్ణ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు. అయితే, బాలకృష్ణతో పాటు వచ్చిన అనుచరులే ఈ ఫ్లెక్సీలు తొలగించినట్లు, ఆయన ‘ఇప్పుడే’.. ‘తీసేయ్’.. అనే మాటలు అంటున్న వీడియోను ప్రముఖ తెలుగు ఛానల్ ఎన్టీవీలో ప్రసారం చేసింది. దీంతో ఘాట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ కు చేరుకుంటున్నారు. 

అయితే, స్కిల్ డెవల్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ స్పందించలేదు. దీనిమీద ఆ సమయంలో ఎన్టీఆర్ స్పందించాలని చాలామంది కోరుకున్నారు. కానీ ఆయన మౌనంగానే ఉన్నారు. దీన్నే మీడియా ఓ సందర్భంలో బాలకృష్ణ దగ్గర ప్రస్తావించగా.. ‘ఐ డోంట్ కేర్’ అని సమాధానం చెప్పడం వైరల్ అయ్యింది. కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు. 

మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహిత మిత్రుడు. ఈ విషయం చాలాసార్లు ఎన్టీఆర్ కానీ, కొడాలినాని కానీ బహిరంగంగానే చెప్పారు. వైసీపీలో చేరిన తరువాత కొడాలినాని చంద్రబాబును.. ఆ తరువాత లోకేష్ ను ఉద్దేశించి అనేకసార్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడలో వైసీనీ తరఫున నేడు ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు నాని ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. మరోవైపు టీడీపీ వర్గాలూ ఎన్టీఆర్ వర్థంతి సభలు ఏర్పాటు చేశారు. ఈ పోటాపోటీ సభలతో గుడివాడ హీటెక్కింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో ఎప్పుడూ లేంది ఎన్టీఆర్ వర్థంతికి వైసీపీ నుంచి కొడాలిని నాని ఎందుకు సభ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు గుడివాడలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై కొడాలినాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ‘జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని ఎవరు చెప్పినా నీచాతి నీచమైన విషయం. ఎన్టీఆర్ పేరు చెప్పి భజన చేసుకునే కుటుంబసభ్యులు.. పెద్ద ఎన్టీఆర్ ను చంద్రబాబు కోసం తీసేశారు. ఇప్పుడు అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను ద్రోహం చేస్తున్నాడు. ఇలాంటి కుటుంబసభ్యులు, మిగతావారు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ ఘాటుగా స్పందించారు.

ఎన్టీఆర్ కొడాలినానికి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యం, ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో జరిగిన వివాదంతో ఇప్పుడు నందమూరి కుటుంబం గొడవలు మరోసారి రచ్చకెక్కినట్టుగా కనిపిస్తుంది. ఇదెంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios