ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ ముట్టడించేందుకు ప్రయత్నించింది. టీఎస్‌పీఎస్‌సీని ముట్టడించేందుకు వెళ్తున్న ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డగించారు. దీంతో Gandhi Bhavan వద్ద ఉద్రిక్తత నెలకొంది.
గాంధీ భవన్ లో బుధవారం నాడు NSUI కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఎన్‌ఎస్‌యూఐ నేతలు TSPSC కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలు దేరారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు గాంధీ భవన్ గేట్లు మూసివేసి ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గాంధీ భవన్ గేటు దూకి టీఎస్‌పీఎస్‌సి కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట్ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అదే రోజు నుండి ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.
అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 91,147 ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692 పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు.
ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగ నియమాకాలను చేపడుతామని కేసీఆర్ చెప్పారు. పోలీస్ శాఖ మినహాయించి అన్ని ఉద్యోగాలకు అభ్యర్ధుల వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ తెలిపారు. ఓసీలకు 44 ఏళ్లు ,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు వయో పరిమితి పెంచుతున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.
