చంచలగూడ నుంచి ఎన్ఎస్‌యూఐ నేతల విడుదల.. జైల్లో పెడితే భయపడం: వెంకట్ బల్మూర్
ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన కేసులో అరెస్ట్ అయిన ఎన్ఎస్‌యూఐ నేత వెంకట్ బల్మూర్ సహా మిగిలిన నేతలు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రభుత్వ చర్యలను ఎండగడతామని వెంకట్ పేర్కొన్నారు.
హైదరాబాద్ చంచల్‌గూడ జైలు (chanchalguda jail) నుంచి ఎన్ఎస్‌యూఐ (nsui) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ (venkat balmoor) విడుదలయ్యారు. ఈ సందర్భంగా తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. జైల్లో పెడితే భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యంతో మరింత కష్టపడతామని వెంకట్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రభుత్వ చర్యలను ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.
కాగా... కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీని (rahul gandhi) ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటనకు అనుమతించాలని కోరుతూ.. ఓయూ వీసీ ఛాంబర్ ఎదుట వెంకట్ బల్మూరి సహా పలువురు ఎన్ఎస్‌యూఐ నేతలు ఆందోళన నిర్వహించారు. అయితే మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ వెంకట్ సహా 18 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. తాజాగా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 18 మందికి నాంపల్లి కోర్డు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వారంతా సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు.
ఇకపోతే.. తెలంగాణ పర్యటనలో భాగంగా మే 7వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పరామర్శించారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో సహా 18 మంది నాయకులను రాహుల్ గాంధీతో ములాఖత్ అయ్యారు. దాదాపు 15 నిమిషాలతో పాటు ఈ భేటీ సాగింది. పార్టీ తరఫున వారికి రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. రాహుల్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్‌ఎస్‌యూఐ నాయకుల వద్దకు వెళ్లారు. చంచల్‌గూల్ జైలులో రాహుల్‌తో పాటు ఒక్కరు మాత్రమే ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో ములాఖత్ అయ్యేందుకు అధికారులు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేవలం భట్టి విక్రమార్క ఒక్కరే రాహుల్‌తో వెళ్లారు.