తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు,... తమ సొంత నియోజకవర్గానికి చేరుకొని.. తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి  ఎన్ఆర్ఐ సత్య ప్రకాష్ సీతాఫల్‌మండి రాగా..  దక్షిణాఫ్రికా నుంచి సరితా గౌడ్ అనే మహిళ సికింద్రాబాద్‌కు వచ్చి ఓటు వేశారు.

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు.మద్యాహ్నం ఒంటిగంట సమయానికి 48శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.