హైదరాబాద్: ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి సహకరించిన ముగ్గురు పోలీసు అధికారుల పేర్లు  చార్జీషీట్‌లో  ఉన్నాయి.  ఈ పోలీసు అధికారుల తీరుపై  విచారణ అధికారులు ప్రత్యేక  నివేదికను రూపొందించారు.

గత ఏడాది జనవరి 31వ తేదీన  ఎన్ఆర్ఐ జయరాం‌ను  రాకేష్ రెడ్డి హత్య చేశాడు. హత్య జరిగిన రోజున రాకేష్ రెడ్డి పోలీసు అధికారులతో మాట్లాడాడు.  రాకేష్ రెడ్డి కాల్ రికార్డ్స్ ఆధారంగా విచారణ అధికారులు  ఈ విషయాన్ని ధృవీకరించారు. పోలీసుల సలహలతోనే జయరాం మృతదేహాన్ని నందిగామకు సమీపంలో వదిలేశారు.

వృత్తిపరంగానే  తాము రాకేష్ రెడ్డితో  మాట్లాడినట్టుగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఈ వాదనతో విచాణ అధికారులు ఒప్పుకోలేదు. 

జయరామ్ హత్య జరిగినట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో  ఎందుకు స్పందించలేదని విచారణ అధికారులు  ప్రశ్నించారు.  ఇద్దరు అధికారులకు రాకేష్ ‌రెడ్డితో ఆర్ధిక సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో  తగిన సాక్ష్యాధారాలు సేకరించినట్టు సమాచారం. 

జయరామ్ హత్య కేసులో పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు.  రాకేష్ రెడ్డితో ముగ్గురు పోలీసులను నిందితులుగా చేర్చారు. దీంతో  ఈ ముగ్గురికి రాకేష్ రెడ్డితో ఉన్న సంబంధాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.

మరో వైపు రాకేష్ రెడ్డి ఇతర కేసుల్లో సంబంధాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రగతి రిసార్ట్స్ చైర్మెన్ ఎండీ జీబీకే రావు ఆయన సతీమణి రాకేష్ రెడ్డిని బెదిరించిన కేసులో కూడ పోలీసులు రాకేష్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించారు. రాకేష్ రెడ్డి బాధితులను బెదిరించిన వీడియోలు, ఆడియోలను కూడ పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. రాకేష్ రెడ్డికి సహకరించిన అనుచరులను కూడ అరెస్ట్ చేసిన తర్వాత  చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం.