హైదరాబాద్: హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. టూ వీలర్ పై వెనుక కూర్చొన్నవారు కూడ కచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. లేకపోతే భారీ జరిమానాను విధించనున్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

టూ వీలర్ పై ఇద్దరు ప్రయాణిస్తే కచ్చితంగా ఇద్దరూ కూడ హెల్మెట్లు  ధరించాలని ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గురైన టూ వీలర్లలో ఎక్కువగా వెనుక కూర్చొన్నవారే మృతి చెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

చిన్న పిల్లలు కూడ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని హైద్రాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు. నాలుగేళ్లు దాటిన పిల్లలు బైక్ పై ప్రయాణిస్తే హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు తెలిపారు.

ఏడాదిగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో టూ వీలర్లపై వెనుక కూర్చొన్న వారు 184 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. హెల్మెట్ లేని కారణంగా తలకు బలమైన గాయాలతో మరణించినట్టుగా పోలీసులు గుర్తు చేస్తున్నారు. 

టూ వీలర్ పై కూర్చొన్న వారు హెల్మెట్ ధరించకపోతే జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం నాడు ప్రకటించారు.ఇప్పటివరకు టూ వీలర్ నడిపే వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరిస్తే  సరిపోయేది. కానీ, టూ వీలర్ పై వెనుక కూర్చొన్న వ్యక్తులు కూడ హెల్మెట్ ధరించకపోతే జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.