హైదరాబాద్: తెలంగాణలో బీజేపీపై దూకుడుగా ఎదురు దాడికి దిగాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.ఈ తరుణంలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని కౌంటర్ ఎటాక్ చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

తెలంగాణలో పలు రాజకీయ పార్టీల నుండి బీజేపీలోకి వలసలు పెరిగాయి. ఈ నెల 18వ తేదీన అమిత్ షా సమక్షంలో జరిగే బహిరంగ సభలో భారీ ఎత్తున పలు పార్టీల నుండి నేతలు బీజేపీలో చేరనున్నారు. 

తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్, ఎంఐఎం లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెన్ పార్టీ తమకు ప్రత్యామ్యాయమని టీఆర్ఎస్ భావిస్తోంది. 15 రోజుల నుండి బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాత్రం టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

బీజేపీ విమర్శలపై ఘాటుగానే సమాధానం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు, పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా సమాచారం.బీజేపీ విమర్శలకు రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు ఘాటుగా సమాదానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ విమర్శలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగానే వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని లక్ష్యంగా చేసుకొని బీజేపీ పావులు కదుపుతోంది.గ్రామీణ ప్రాంతాల్లోని టీడీపీ క్యాడర్ ను. నేతలను  తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఎంపీ గరికపాటి మోహన్ రావు టీడీపీ క్యాడర్ ను బీజేపీలో చేర్పించే పనిలో బిజీగా ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

బీజేపీలో చేరే నేతలంతా ప్రజల్లో బలం లేని వారేనని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ నేతల చేరికల వల్ల బీజేపీకి పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఉండదని టీఆర్ఎస్ నాయకత్వం విశ్వాసంతో ఉంది.