హెచ్చార్కేకి పరిచయం , ఈ ఘోషకు ఉపోద్ఘాతం అవసరంలేదు...
వారెవ్వా తెలంగాణా! కోటి గాయాల వీణా!
వారెవ్వా తెలంగాణా! అయ్యయ్యో తెలంగాణా! ఉరిమి ఉరిమి నిన్ను అమితంగా ప్రేమించే మనిషి మీద పడ్డావా? ఛీ ఛీ. అతడి ఇంటి వాకిలి బద్దలు కొట్టి అతడిని బందీ చేసి తైతక్కలాడేవా?
ఏమయ్యారు తెలంగాణ కోసం చేసిందాని కన్న పొందిన ఉద్యోగాలు, బహుమతులు అధికమైన నందినులు, నారాయణలు, చక్రాలు, పదవి వచ్చే దాక వదలని రాముళ్లు, గౌరీ శంకరాలు, ఎరుపు వెలిసిన ఎస్వీ లు, ముస్లిం ఆకాశాలు... సార్లూ చాతనవుతుందా మీకు ఆ సిగ్గు బిళ్లలు వదిలేసి మళ్లీ నిజం బట్టలేసుకుని వీధుల్లో తిరగడం ?
ఇప్పుడు పిలుస్తోందయ్యా నిజమైన పోరు తెలంగాణా. అచ్చమైన సామాజిక తెలంగాణా. ఇది అడవుల పోరు కాదు. పోరు వూరిలోకి వచ్చింది. ఇంటిలోకి వచ్చింది. ఇళ్ల తలుపులు బద్దలు కొడుతోంది. రేపు మీ తలుపూ బద్దలవుతుంది, మరీ పూర్తిగా కరిగిపోతే తప్ప.
కల్మషం లేని విద్యైక జీవి, నిరంతరం పౌరహక్కుల వక్త, ప్రజా ప్రేమి కోదండ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడంతో మీ గ్రేస్ పీరియడ్ అయిపోయింది. తెలగాణ ఉద్యమ గాథలో మరొక ఛాప్టర్ ముగిసింది. ఢిల్లీ స్వస్తికా హైదరాబాదుకు చేరింది. ఆరెసెస్, రజాకార్ సంకర సంతానం ఎదిగివచ్చి విషం కోరలు సాచింది.
కుల, మతాల భాషలో ముడ్డి లేని ముంత సిద్ధాంతాలతో కేసియార్ హైన్యానికి డొంక తిరుగుడు సమర్థనలు చాలిక. ఆ మాటలు మీ పెదవి దాటక ముందే వాటి పస తెలిసిపోతోంది. నేరుగా కొందరు, అనేరుగా కొందరు... ఈ కొత్త జాగీర్దార్లు, జమీందార్లకు సేవ చేసి తరిస్తారో, ఆ నాడు మీ నంగి నంగి మాటలు (కూడా) విని ఆత్మహత్యలను సైతం ఆయధాలు చేసుకుని తెలంగాణ సాధనకు ప్రాణాలతో మెట్లు కట్టిన యువకులకు... ఇవన్నీ చూసే బదులు, తామలా మరణించడమే మేలని... అనిపింపిస్తారో ఇక తేల్చుకోక తప్పదు. ఆ రకం హిపోక్రిసీ మీద మీరు నిర్మించే భవితవ్యం మా పిల్లలతో పాటు మీ పిల్లలకూ వినాశకరమని గుర్తించి ఈ సమయానికి తగిన తీవ్ర స్వరాలతో, చర్యలతో ముందుకు వస్తారో రారో ఇవాళే తేల్చుకోండి.
ఇది వాషింగ్టన్ వయా ఢిల్లీ వయా అమరావతి వయా హైదరాబాద్ వయా పట్నం ఇక ప్రతి పల్లెకు పాకనున్న స్వస్తికా మార్కు అరాజకీయం. ఇది ఇక్కడితో ఆగదు. రాజీ పడితే, ఇది మిమ్మల్ని మానసికంగా ఈ మాత్రం సుఖంగా కూడా వుండనివ్వదు. అటో ఇటో తేల్చుకోక తప్పదు. మేల్కొని ప్రజల మనుషులు కండి. ధీరుడు కోదండ్ ధిక్కారానికి క్రియాశీలంగా వాదోడు అవుదాం, చాతనైతే చేదోడూ అవుదాం.
ఇప్పుడు కదిలే ప్రతి జీవ కణానికి నా లాల్ సలామ్.
--- హెచ్చార్కే
1:22 22-2-2017, రాత్రి.
