కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి ఊహించని షాక్ తగిలింది. రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.  ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం ఈ వారెంట్ ని జారీచేసింది. తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుకా చౌదరి మోసగించిందని చంద్రకళ అనే మహిళ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

బాధితురాలు వేసిన పిటిషన్ ని కోర్టు స్వీకరించింది. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం రేణుకాకు నోటీసులు జారీ చేసింది. అయితే... ఆ నోటీసులను రేణుకా చౌదరి స్వీకరించలేదు. అంతేకాకుండా కోర్టుకు కూడా హాజరు కాలేదు. ఈ క్రమంలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి దీనిపై రేణుకా చౌదరి ఎలా స్పందిస్తారో చూడాలి. 

బాధితురాలు చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం... వైద్యుడిగా ప్రాక్టీసు చేసుకుంటున్న తన భర్త రామ్‌జీకి 2014లో వైరా అసెంబ్లీ టికెట్‌ ఇప్పిస్తానని రేణుక తొలుత రూ.1.2 కోట్లు తీసుకున్నారని, తర్వాత అభివృద్ధి పనులు, సమావేశాల పేరుతో మరో కోటి రూపాయలకుపైగా ఖర్చు పెట్టించారన్నారు. 

టికెట్‌ ఇవ్వకుండా మొండిచేయి చూపారని, ఆమె అనుచరులు పుల్లయ్య, రామారావు, రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్‌రెడ్డిలు తమను కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించారని వాపోయారు. ఈ అవమానాన్ని భరించలేక తన భర్త తీవ్ర మానసిక వేదనతో 2014 అక్టోబర్‌ 10న మృతి చెందారన్నారు. 

ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ... ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆమె వేసిని పిటిషన్ ని స్వీకరించిన న్యాయస్థానం తొలుత రేణుకా చౌదరికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు స్పందించకపోవడంతో.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.