డబ్బులు లేకపోతే ఎవరూ పట్టించుకోరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తన నియోజవర్గంలో దళితబంధు పథకం అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆయన మనిషి జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను తెలియజేశారు.
డబ్బు.. దీని చుట్టూనే ప్రపంచం తిరిగేది. ఇది లేకపోతే రోజు గడవని పరిస్థితి. దీని కోసమే మనిషి లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కష్టపడతాడు. డబ్బు సంపాదించేందుకు ఉన్న ఊరిని, కన్న తల్లిని వదిలి వలస వెళ్తాడు. ఇది కొందరికి అవసరం అయితే మరి కొందరికి విలాసం. కొందరు డబ్బు కూడబెట్టడంలోనే ఆనందం వెతుక్కుంటే మరి కొందరు దానిని ఖర్చుపెట్టడంలో సంతోషం పొందుతారు.
ప్రస్తుతం మానవ సంబంధాలు అన్నీ కూడా ఈ డబ్బు చుట్టూనే ముడిపడి ఉన్నాయి. డబ్బులు ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి హోదా పొందవచ్చు. అజాద్ సినిమాలో హీరో నాగర్జున ఓ సందర్భంలో డబ్బు గురించి ఓ పాటపాడతారు. రైలు బండిని నడిపేది పచ్చ జెండా అయితే, బతుకు బండిని నడిపేది ఈ పచ్చనోటే అని చెబుతారు. ‘‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు.. పైసుంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు..’’ అంటూ డబ్బు విలువను తెలియజేస్తారు. మనీ ఉంటేనే కుటుంబ సభ్యులైనా, బంధువులైనా గౌరవిస్తారు. అందుకే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు కార్ల్ మాస్క్. డబ్బు గురించి ఇప్పుడు అంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ? దానికి ఓ కారణముంది.
తెలంగాణ కళాకారుడు, టీఆర్ఎస్ ఎమ్మెలే రసమయి బాలకిషన్ (trs mla rasamai bala kishan) డబ్బు ఇచ్చే విలువపై కామెంట్స్ చేశారు. కరీంనగర్ (karimnagar) జిల్లాలోని మానకొండూరు (manakonduru) నియోజవర్గంలో దళితబంధు పథకంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మనిషికి డబ్బు చాలా ముఖ్యమని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం సాధించక ముందు ఆడపిల్లలను భారంగా భావించి పుట్టిన వెంటనే అమ్మేసే వారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల పుడితే పెళ్లి, ఇతర ఖర్చులు భరించలేమని కుటుంబాలు ఆందోళన చెందేవని చెప్పారు. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు అన్నీ మారిపోయాయని తెలిపారు.
ఈ సమాజంలో పైసలు లేకపోతే ఎవ్వడూ పట్టించుకోడని రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు చేశారు. మనిషి జీవితంలో డబ్బు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. తెలంగాణ సీఎం దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ పథకం ద్వారా దళితులు ఆర్థిక స్వాలంభన సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసి దళితులు ఆర్థిక ప్రగతి సాధించేలా కృషి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే మొదటగా ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో అమలు చేస్తామని ప్రకటించింది. దీనిపై విమర్శలు రావడంతో నాలుగు నియోజకవర్గాల్లోని మరో నాలుగు మండలాల్లో కూడా దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తామని తెలిపింది. ఇటీవలే ఈ పథకాన్ని త్వరలోనే విడతల వారీగా రాష్ట్రం అంతటా అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. పైలెట్ ప్రాజెక్టు కింది ఎంపికి చేసిన నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు కోసం ప్రభుత్వం ఇటీవలే నిధులు విడుదల చేసింది.
